లంచాల కీసర ఖాకీలు!

10-11-2026 | 05:05am
  1. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఎస్సై శ్రీనివాస్ 
  2. రెండు నెలల క్రితం ఇదే స్టేషన్‌లో ఏసీబీకి చిక్కిన సీఐ, మరో ఎస్సై

మేడ్చల్/ఉప్పల్, నవంబర్ 9 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌(Keesara Police Station)లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కొండారెడ్డి శ్రీనివాస్(Sub-Inspector Kondareddy Srinivas) రూ.2 లక్షల లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక వ్యక్తిపై కీసర పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి చీటింగ్ కేసు కాగా, మరొకటి వరకట్నం కేసు. చీటింగ్ కేసులో అత డు అరెస్టు కాగా, వరకట్నం కేసులో 

కోర్టును ఆశ్రయించి 41(ఏ) సెక్షన్ కింద నోటీసు ఇవ్వాలని ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ కేసులో పోలీసులు మరికొన్ని సెక్షన్లు పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో అతడికి బెయిలు వచ్చినప్పటికీ, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ కేసులో తనకు అనుకూలంగా త్వరగా చార్జిషీట్ వేయడానికి ఎస్సై శ్రీనివాస్ ఈ నెల ౨న బాధితుడిని రూ.ఐదు లక్షలు డిమాండ్ చేశాడు.

అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు బతిమిలాడగా, రూ.రెండు లక్షలకు ఒప్పందం కుదిరింది. సోమవారం బాధితుడు రూ.2 లక్షల నగదు తీసుకొని కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే ఎస్సై అక్కడి నుంచి నాగారంలోని శిల్పానగర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌కు రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లిన బాధితుడు కవర్‌లో నగదు పెట్టి ఎస్సై శ్రీనివాసుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సైని అరెస్టు చేశామని, మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. 

రెండు నెలల్లోనే ముగ్గురు

రెండు నెలల్లో ఒకే స్టేషన్‌కు చెందిన సీఐ, ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. సెప్టెంబర్ 16వ తేదీన అర్ధరాత్రి సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేంద్రరెడ్డి.. గణేష్ నిమజ్జనం విధుల్లో ఉండి రూ.ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వారు ఏసీబీకి దొరకిన సందర్భంలో స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సంఘటన తరువాత రెండు నెలల్లోనే మరో ఎస్సై లంచం తీసుకుంటూ దొరకడం గమనార్హం. 

మరిన్ని వార్తలు