దేశద్రోహులు ఎవరో తేల్చుకుందామా?
బహిరంగ చర్చకు వస్తారా..?
ప్రధాని మోదీకి విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ సవాల్
న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రధాని మోదీ(PM Modi) ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరు? తేల్చుకుందామా?’ అని ప్రధా మోదీకి రాహుల్ గాంధీ సోమవారం ‘ఎక్స్’ వేదికగా మరోసారి సవాల్ విసిరారు. తనతో ముఖాముఖి చర్చకు రావాలని, వేదిక ఎక్కడైనా, సమయమేదైనా తాను సిద్ధమే అన్నారు. ఈ చర్చ జరిగిన తర్వాత ప్రధాని మోడీ ఏ ఒక్క జవాన్ ఎదుట నిలబడే ధైర్యం కూడా చేయలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా భద్రతా సిబ్బంది ఎదుట ప్రధాని అబద్ధాలు ఆడారని, ఆయన అబద్ధాలను భద్రతా సిబ్బంది నమ్మలేదనడానికి వారి ముఖ కవళికలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.