అకౌంట్ లేకున్నా డబ్బులు పంపే ఛాన్స్

12-11-2026 | 03:36pm

బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు నగదు రూపంలో ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు కొన్ని పరిమితులు, నిబంధనలు వర్తిస్తాయి. నగదు బదిలీల (Cash Remittance) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎంత మొత్తం పంపవచ్చు? ఏటీఎం, బ్యాంకు ప్రతినిధుల ద్వారా చేసే లావాదేవీలకు ఎంత పరిమితి ఉంది? తెలుసుకుందాం.

ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోయినా నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లి నగదు రూపంలో ఇతరుల ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఇందుకు నెఫ్ట్ (NEFT) సేవను వినియోగించుకోవచ్చు. ఈ విధానంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.50 వేల వరకు నగదు పంపవచ్చు. ఈ పరిమితిని ఆర్బీఐ కొనసాగించింది.

బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు బిజినెస్ కరస్పాండెంట్లు (Business Correspondents), ఏటీఎంలు లేదా అనుమతించిన ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బులు పంపవచ్చు. అయితే ఈ విధానంలో ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.5 వేలు మాత్రమే పంపాలి. ఒక వ్యక్తి నెలలో పంపే మొత్తం రూ.25 వేలకు మించకూడదు.

డబ్బు పంపే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండి, స్వీకరించే వ్యక్తికి ఖాతా లేకపోయినా కొన్ని మార్గాల ద్వారా నగదు అందించవచ్చు. అయితే ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే పంపాలి. నెల మొత్తంలో ఇలా అందించే నగదు రూ.25 వేలకు మించకూడదు.

డబ్బు పంపే వ్యక్తి మొబైల్ నంబర్‌ను బ్యాంకు ధ్రువీకరించాలి. కేవైసీ (KYC) నిబంధనల ప్రకారం గుర్తింపు పత్రాల వివరాలను కూడా నమోదు చేయాలి. నగదు రూపంలో పంపిన మొత్తాన్ని గుర్తించేందుకు నెఫ్ట్, ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీల వివరాల్లో ప్రత్యేక సంకేతాన్ని పొందుపరచాలి. డబ్బు పంపిన వ్యక్తి వివరాలను బ్యాంకులు భద్రపరచాలి.

ఒక బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు జమ అవుతున్నా, అనుమానాస్పద లావాదేవీలు (Suspicious Transactions) జరిగినా బ్యాంకులు వెంటనే పరిశీలించాలి. అనుమానం బలపడితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నగదు బదిలీలు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలి. బ్యాంకుల మధ్య లావాదేవీలు ఆర్బీఐ ఆమోదించిన వ్యవస్థల ద్వారానే జరగాలి.

ఈ నిబంధనలు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతోపాటు సంబంధిత చెల్లింపు సేవల సంస్థలకు వర్తిస్తాయి. ఒక కార్డు నుంచి మరో కార్డుకు జరిగే నగదు బదిలీలు మాత్రం ఈ నిబంధనల పరిధిలోకి రావు.

మరిన్ని వార్తలు