ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

12-11-2026 | 03:55pm

జగిత్యాల, నవంబర్ 12( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో(Sri Koteswara Swamy Temple, Kotilingala) జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా  కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని, ఇప్పటివరకు పూర్తయిన పనులను, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో కోటిలింగాల పుణ్యక్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టాల్సిన పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా చేపట్టాల్సిన పనులు ఏమిటనే అంశాలను పరిశీలించారు.

పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి....

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనువైన రహదారులు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్, వైద్య సదుపాయాలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పుష్కరాల సమయంలో భక్తులు సురక్షితంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోటిలింగాల పుణ్యక్షేత్రానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆలయ అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మండల తహసీల్దార్, ఎంపీఓ, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు