రీ సర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి
క్షేత్రస్థాయిలో రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 12 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవ్పేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనుల పురోగతిని, సర్వే చేపడుతున్న విధానాన్ని, భూ రికార్డులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, ఇతర రెవెన్యూ రికార్డుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు.
సర్వే నిర్వహణ సమయంలో రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరించేలా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన మార్గదర్శకాలు, లక్ష్యాలకు అనుగుణంగా రీ సర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.....
అనంతరం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను, పనుల పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఎలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటి నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన సహాయ సహకారాలు సకాలంలో అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులు త్వరగా తమ సొంత ఇళ్లలో నివసించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, హౌసింగ్ అధికారి భాస్కర్, ల్యాండ్ సర్వే ఏడీ, ఎంపీఓ, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.