ఆరుతడి పంటలు వేయండి
బొల్లారం,వదల్పర్తి, తాండూర్ గ్రామాలలో యాసంగి పంట సాగుపై అవగాహన
నాగిరెడ్డిపేట,నవంబర్ 12 (విజయ క్రాంతి):మండలంలోని బొల్లారం, తాండూర్ వదల్పర్తి గ్రామాలలో వ్యవసాయ విస్తరణాధికారులు (Agricultural Extension Officers) రజిత, ప్రతిభ, ప్రశాంత్ కుమార్‌లు రైతులతో సమావేశం నిర్వహించి యాసంగి పంటల ప్రణాళిక, ఫార్మర్ రిజిస్ట్రీ, నీటి సంరక్షణ, పంటల అవశేషాల నిర్వహణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు తమ భూముల నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి వసతి మరియు నేల స్వభావానికి అనుగుణంగా వరితో పాటు శనగ, మొక్కజొన్న, వేరుశనగ, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులు పీఎం-కిసాన్ పథకం ప్రయోజనాలు పొందడానికి, అలాగే పంటకు సంబంధించిన ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి రైతు నమోదు ఎంతో ముఖ్యమని వివరించారు.కాబట్టి ప్రతి రైతు తమ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.అలాగే వానాకాలంలో సాగు చేసిన పంటల అనంతరం పొలాల్లో మిగిలిపోయిన పంటల అవశేషాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని రైతులకు సూచించారు.
ఇలా చేయడం వల్ల పంటల అవశేషాలు సేంద్రియ పదార్థాలుగా మారి నేలలో సేంద్రియ కర్బనం పెరగడంతో పాటు భూసారం మెరుగు పడుతుందని, నేలలో తేమ నిల్వ ఉండటానికి సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని నివారించడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులను సంరక్షించుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు బద్దిగారి ప్రభు గౌడ్,సత్యబోయిన పద్మ నారాయణ మాట్లాడుతూ...ప్రతి రైతు తమ పొలాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని,వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా బోరుబావుల వద్ద బోర్వెల్ రీచార్జ్ గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.
ప్రతి రైతు నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు.రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని,విత్తనశుద్ధి చేపట్టాలని, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని,వ్యవసాయ శాఖ అందించే సలహాలు,సూచనలు పాటిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సర్పంచులు వివరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు ప్రభు గౌడ్,సత్యబోయిన పద్మ నారాయణ,గ్రామ ఉప సర్పంచ్ల గడ్డమీది స్వరూప ఏసు, శ్యామల గంగారం, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, కారబర్ బాలచందర్,గ్రామ రైతులు ఆంజనేయులు, నాగయ్య నర్సింలు, సిద్దయ్య, సిద్దవ్వ, లక్ష్మీ, వినోద తదితరులు పాల్గొన్నారు.