ఉప్పల్‌లో అన్ని పీహెచ్‌సీల అభివృద్ధికి కృషి చేస్తా
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ నవంబర్ 12విజయక్రాంతి : నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy) అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్‌సీ) ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో నూతన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన వైద్య ఆధారమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలు ఉంటే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న భవనాల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు.
అలాగే మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆనంద్‌ను కలిసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, నూతన భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గంధం నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.