తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు
జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అజ్మీరా మురళి ( 61) సుశీల ( 60) అనే వృద్ధ తల్లి దండ్రులను వారి ఐదుగురు కొడుకులు రవి, పాండు, సురేష్, వెంకటేష్, రాజేందర్ లు పోషణ, వైద్య ఖర్చులు పెట్టక కొట్టి ఇంట్లోంచి గెంటి వేశారని జగిత్యాల జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను శనివారం వృద్ధ తండ్రి అజ్మీరా మురళి ఆశ్రయించాడు. కాగా శనివారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో ఆ తండ్రి వెళ్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007 కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ఆ వృద్ధ తండ్రి అజ్మీరా మురళి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో తన గోడు విలేకరులకు వినిపించారు. తాను దుబాయ్ వెళ్లి కష్టించి పని చేసిన డబ్బులతో ఇటిక్యాల గ్రామం లో ఐదుగురు కొడుకులకు 5 బంగ్లాలు కట్టించానని, వృద్దాప్యంలో అనారోగ్యంతో భాదలు పడుతున్న తల్లి దండ్రులమైన నన్ను, నా భార్య ను మా కొడుకులు పోషించక పోగా మేము కట్టించిన బంగ్లా లో కూడా మమ్మల్ని ఉండకుండా కొట్టి ఎక్కడైనా సావు పొండ్రి అని గెంటి వేయగా బంగ్లాల బయట రేకుల షెడ్డు లో ఆర్ధిక, శారీరక ఇబ్బందులతో బతుకుతున్నాం.
అక్కడ కూడా ఉండనివ్వడం లేదని, పెద్ద మనుషులు చెప్పినా ఖాతరు చేయడం లేదని నా కొడుకులు కన్న తల్లి దండ్రులమైన మమ్మల్ని వారి బంగ్లాల ఉంచుకొని మమ్మల్ని పోషిస్తూ ప్రతి నెలా ఒక్కొక్కరు రూ. 5 వేలు చొప్పున పోషణ వైద్య ఖర్చులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించి ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా తమ కొడుకులపై వృద్ధుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారని, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆ వృద్ధ తండ్రి విలేకరుల ముందు ఏడుస్తు చెప్పిండు. ఆ వృద్ధ తండ్రి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్, చట్టం కాన్సిలియేషన్ అధికారులు పి. సి. హన్మంత్ రెడ్డి, ఎం. డి. యాకూబ్, సీనియర్ సిటిజెన్స్ సంఘం ప్రతినిధులు తదితరులున్నారు.