మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట

28-11-2026 | 07:07pm

మహబూబాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నాయకత్వంలో కేంద్రం మహిళా సాధికారికకు పెద్దపీట వేస్తోందని మహబూబాబాద్ పట్టణ బీజేపీ ఇన్చార్జ్ ఎల్ది మల్లయ్య అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెంపు కల్పించే దిశగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ ఇంచార్జ్, మాజీ వైస్ ఎంపిపి ఎల్ది మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ.... మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ,నియోజకవర్గాల పెంపు చరిత్రాత్మక నిర్ణయమని, మహిళా సాధికారతకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలనెలా 25 వందలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యిచూపి కోటిమంది మహిళామణులు కోటీశ్వరులు చేస్తామని సీఎం చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

రాజకీయాల్లో మహిళాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ,భారతీయ జనతా పార్టీకి మానుకోట మహిళల అండదండలు అందించాలని కోరారు. స్థానిక ప్రజల తరఫున మోడికి,కేంద్ర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీదేవి బాలునాయక్, ఇందు భారతి, చుక్కల నరేష్, రవి యాదవ్, గాడిపెల్లి శ్యామ్, శైలజా,సుజాత యశ్వంత్, ప్రవీణ్, సుజాత, వలపుదాసు భద్రయ్య, ప్రేమ్ సాగర్, బాలు నాయక్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు