పుస్తక ప్రదర్శన, విద్యార్థులకు మెమొరీ టెస్ట్ నిర్వహణ

15-11-2026 | 04:57pm

జగిత్యాల, నవంబర్ 15 (విజయక్రాంతి): జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాలలో పుస్తక ప్రదర్శన(Book Exhibition) కార్యక్రమంతో పాటు, విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా మెమొరీ టెస్ట్ (జ్ఞాపకశక్తి పరీక్ష) పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన గావించి, రిబ్బన్ కత్తిరించి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగనబట్ల దినేష్ విద్యార్థులను ఉద్దేశించి పుస్తక పఠన ప్రాముఖ్యత గురించి అద్భుతంగా ప్రసంగించారు.

విద్యార్థులు పాఠశాల పాఠ్యపుస్తకాలతో పాటు వైవిధ్యభరితమైన గ్రంథాలయ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం మనుషుల ఆలోచనా విధానాన్ని మారుస్తుందని, విద్యార్థులలో సృజనాత్మకతను, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పుస్తకాలను నేస్తాలుగా మలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ కటకం సంజీవ రెడ్డి, గ్రంథపాలకులు జె. వసంత్, కె. మల్లయ్య, సగ్గు కృష్ణ, ఆర్.స్వామి, డి.రాజు  ఉపాధ్యాయినీలు, అనిత, జమున రాణి, చందన, తరంగిణి పాల్గొన్నారు. ఈ పుస్తక ప్రదర్శన, మెమొరీ టెస్ట్ కార్యక్రమానికి పాఠకులు, భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు