పాలకుర్తిలో అఖండ జ్యోతి ప్రచార రథం ప్రారంభం

19-11-2026 | 02:35pm

జనగామ, నవంబర్ 19 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి (Karthika Pournami) సందర్భంగా ఈ నెల 24న మంగళవారం పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించనున్న అఖండ జ్యోతి దర్శన (Akhand Jyothi Darshan) కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న కోరారు. గురువారం దేవస్థానం ఆవరణలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ జ్యోతి ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. శబరిమల మకర జ్యోతిని పోలిన రీతిలో పాలకుర్తి క్షేత్రంలో దక్షిణ భారతదేశంలో మూడో అతిపెద్ద అఖండ జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు (Facilities) కల్పిస్తున్నామని వెల్లడించారు. అఖండ జ్యోతికి అవసరమైన నూనె, వత్తులు, కర్పూరాన్ని ప్రతి ఇంటి నుంచి భక్తులు ప్రచార రథానికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ప్రచార రథాల ద్వారా విస్తృత ప్రచారం (Publicity Campaign) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు డీవీఆర్ శర్మ, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది రాములు, రమేష్, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు