బాన్సువాడలో ప్రత్యేక సన్న బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

19-11-2026 | 05:12pm
  1. సామాన్యులకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం...
  2. ధరల నియంత్రణకు స్పెషల్ రైస్ కౌంటర్లు ఏర్పాటు...
  3. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

బాన్సువాడ, నవంబర్ 18 (విజయ క్రాంతి): బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న సన్న బియ్యం(Fine-grain rice) ధరలకు కళ్లెం వేయడంతో పాటు సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు గురువారం బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని (స్పెషల్ రైస్ కౌంటర్) ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతంలో మార్పులు, వ్యవసాయ ఉత్పత్తులపై పడుతున్న ప్రభావం తదితర కారణాలతో బియ్యం ధరల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో ధరలను పర్యవేక్షిస్తూ, సామాన్యులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

ప్రత్యేక రైస్ కౌంటర్ల ద్వారా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు వివిధ రకాల సన్న బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ కార్డులు లేని అల్పాదాయ వర్గాల ప్రజలు సైతం ఈ కేంద్రాల ద్వారా బియ్యం కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బియ్యం రకం| కిలో ధర| 26 కిలోల బ్యాగ్

BPT కొత్త బియ్యం| రూ.53| రూ.1,378

BPT స్టీమ్ బియ్యం| రూ.64| రూ.1,664

RNR కొత్త బియ్యం (తెలంగాణ సోనా)| రూ.64| రూ.1,664,HMT స్టీమ్ బియ్యం| రూ.72| రూ.1,872

JSR స్టీమ్ బియ్యం| రూ.78| రూ.2,028

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బాన్సువాడలో ప్రత్యేక రైస్ కౌంటర్ ఏర్పాటుకు సహకరించిన తిరుమల రైస్ షాప్ నిర్వాహకుడు వెంకన్నను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, రైస్ మిల్లర్ల డివిజన్ అధ్యక్షుడు నాగులగామ వెంకన్న తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు