తరిగొప్పులలో ప్రోటోకాల్ రగడ..

18-11-2026 | 02:32pm

తరిగొప్పుల, నవంబర్ 18 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన చేయూత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) మాట్లాడుతుండగా.. చేర్యాల మార్కెట్ చైర్మన్ కొమ్మూరు ప్రశాంత్ రెడ్డికి మైక్ ఇవ్వడం లేదనే అంశం వివాదంగా మారింది.

పెన్షన్ లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై ప్రోటోకాల్ విషయంలో ఇరు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం, ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వకపోవడంపై అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పెన్షన్ పంపిణీ వంటి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో ఇలాంటి వివాదాలు రావడం సరికాదని, అధికారులు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ గౌరవం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. అనంతరం పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగి, పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్ధిదారులు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.

పెన్షన్ కోసం ఉదయం నుంచే వేచి ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పంపిణీ జరగకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. నాయకుల మధ్య వివాదం వల్ల తమకు న్యాయం జరగలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి26 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, తాసిల్దార్ మోసిన్ ముస్తప, గ్రామ సర్పంచ్ అర్జుల జ్యోతి, కుర్ర మల్లయ్య, దండం శ్రీను, భూక్య రవి, అన్ని గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు