ఎల్నినో ప్రభావాలపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన
మహా ముత్తారం,(విజయక్రాంతి): మహాముత్తారం మండలం ములుగుపల్లిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma), జిల్లా డీపీఆర్ఓ శ్రీనివాస్, ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సోమవారం మహాముత్తారం మండలంలోని ములుగుపల్లి గ్రామంలో సెగ్గం శిరీష కళాబృందం సభ్యులు ఎల్నినో ప్రభావాలపై కళాజాత కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కళాకారులు పాటలు, మాటలు మరియు వివిధ కళారూపాల ద్వారా ఎల్నినో అంటే ఏమిటి? దాని ప్రభావం వల్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, వర్షపాతం తగ్గడం, అనావృష్టి వంటి పరిస్థితులు ప్రజల జీవితాలపై, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కళాకారులు సూచించారు.
సాగునీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకోవాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన పెసర్లు, కందులు, శనగలు, మినుములు, నువ్వులు వంటి పంటల సాగుపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. అలాగే అవసరానికి మించి రసాయన ఎరువులు, కలుపుమందులు వినియోగించకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని, నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు అవలంబించాలని రైతులకు తెలియజేశారు.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులు, పక్షులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, నీటి వృథాను అరికట్టి ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా తెలియజేశారు.
విద్యుత్ వినియోగంలో కూడా పొదుపు పాటించాలని, అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలని, ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కళారూపాల ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ కళా ప్రదర్శనల ద్వారా కీలక పాత్ర పోషిస్తున్నారు.
సాధారణ ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా పాటలు, సంభాషణలు, నృత్యాల రూపంలో సామాజిక అంశాలను వివరించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెగ్గం శిరీష కళాబృందం సభ్యులు తమ కళా ప్రదర్శనలతో గ్రామ ప్రజలను ఆకట్టుకుంటూ ఎల్నినో ప్రభావాలపై అవగాహన కల్పించారు.