సర్పంచ్ కన్నూరి రాజబాపు కుటుంబానికి అండగా మాదిగల ఐక్యవేదిక

09-11-2026 | 02:41pm

పుట్టపాకలో గంటపాటు రాస్తారోకో.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం పుట్టపాక గ్రామ సర్పంచ్ కన్నూరి రాజబాపు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన నగరంపల్లి గ్రామ ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి(Deputy Sarpanch Tirupati Reddy)పై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ సోమవారం పుట్టపాక గ్రామంలో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా పుట్టపాక గ్రామ(Puttapaka village) ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించి, నిందితుడు తిరుపతి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, ఆయనకు సహకరించిన వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యాయత్నం కేసు నమోదు చేసి, నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో కఠినంగా శిక్షించాలని కోరారు.

అంతకుముందు సర్పంచ్ కన్నూరి రాజబాపు కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఈ ఆందోళన విషయం తెలియడంతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తాం అని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ ఆందోళనలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలకు చెందిన మాదిగ సామాజికవర్గ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఇదే ఐక్యతతో స్పందించి న్యాయం జరిగే వరకు పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ మాదిగల ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు