కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
గణపురం, నవంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. గణపురం మండల కేంద్రంలో నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంకులు, సౌర విద్యుత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల్లో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ బాలకృష్ణ, ఎంపీడీవో తహసీల్దార్ అడ్డూరి రాజేశ్వరరావు, ఎంపీడీవో లంకెపల్లి భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్లు కన్నబోయిన కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణరెడ్డి, సర్పంచులు కట్కూరి రాధిక శ్రీనివాస్, కావాటి రజిత రవీందర్తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.