గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్ చైర్మన్ చల్లూరి మధు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 15 (విజయక్రాంతి): భారత రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చల్లూరి మధు రాష్ట్ర రెడ్‌క్రాస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రెడ్‌క్రాస్ శాఖ సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టనున్న సేవా కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. స్థానిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు రూ.50 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. భవన నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వివరించారు.
భూపాలపల్లి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, సింగరేణి, కేటీపీపీ వంటి పారిశ్రామిక సంస్థలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు హైదరాబాద్ స్థాయిలో రెడ్‌క్రాస్ సేవలు (Healthcare Services) అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చల్లూరి మధు తెలిపారు. ఈ దిశగా జిల్లా రెడ్‌క్రాస్ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు వైద్య సేవల విస్తరణ, రక్తనిధి కేంద్రం (Blood Bank), జనరిక్ మెడికల్ స్టోర్ అభివృద్ధి, అత్యవసర సేవలకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర రెడ్‌క్రాస్ శాఖ సహకరించాలని గవర్నర్‌ను కోరారు. భవన నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక నాయకులతో కలిసి గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ జిల్లాల రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్లు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్‌గా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నికతో పాటు యూత్ రెడ్‌క్రాస్, జూనియర్ రెడ్‌క్రాస్, ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్, నషా ముక్త్ భారత్, విపత్తుల నిర్వహణ కమిటీలకు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వివిధ జిల్లాల రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు, జిల్లా చైర్మన్లు, చైర్‌పర్సన్లను గవర్నర్ అభినందించారు.