చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీలు కీలకం
- సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
- అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
గణపురం, నవంబర్ 11 (విజయ క్రాంతి): చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రాథమిక విద్యపై(Primary Education) ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. బుధవారం గణపురం మండల కేంద్రంలోని హరిజన కాలనీలో ఉన్న నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి, పౌష్టికాహారం అందించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తిక్క సంపత్, అంగన్వాడీ టీచర్లు నారగాని వెంకటరమణ, ఆదిముల్లా దేవకమ్మ చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.