విధి నిర్వహణలో గుండెపోటు
ఫీల్డ్ అసిస్టెంట్ నరసయ్య మృతి
వెంకటాపూర్, నవంబర్ 11 (విజయక్రాంతి): మండలంలోని రామానుజపూర్ గ్రామానికి చెందిన వీబీ-జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం(VB-G Ramji Employment Guarantee Scheme) ఫీల్డ్ అసిస్టెంట్ నిమ్మల నరసయ్య బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామంలో విఓ టాయిలెట్ వద్ద ముగ్గు పోస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు.
ఉపాధి హామీ పథకం విధుల్లో భాగంగా గ్రామంలో పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధులు నిర్వహిస్తూనే ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను కలచివేసింది.
నరసయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యోగులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు గ్రామస్తులు నరసయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.