విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు ప్రయోగిక నైపుణ్యాలు

17-11-2026 | 08:04pm
  1. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జీఎం
  2. 17 నుండి 19 వరకు మూడు రోజుల శిక్షణ
  3. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

భూపాలపల్లి టౌన్, నవంబర్ 17 ( విజయక్రాంతి ) : విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు ప్రయోగిక నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్(The Bharat Scouts and Guides), సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో నవంబర్ 17, 18, 19వ తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పయోనీరింగ్ అండ్ క్యాంప్ క్రాఫ్ట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం జీఎం ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. స్కౌటింగ్ అనేది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదని, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దే గొప్ప వేదిక అని పేర్కొన్నారు.

ఈ శిక్షణ శిబిరంలో సుమారు 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొని పయోనీరింగ్ నైపుణ్యాలు, క్యాంప్ క్రాఫ్ట్, తాళ్లతో వివిధ నిర్మాణాల ఏర్పాటు, టెంట్ నిర్మాణం, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో శిక్షణ పొందనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయికృష్ణ, ఏ‌ఎస్‌ఓసీలు సాయి, నిరంజన్, సుధాకర్, లీడర్ ఆఫ్ ద కోర్స్ శక్తికుమార్, శ్రీనివాస రావు, స్వామి, రాజమౌళి, రమేశ్, సరిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు