యజ్ఞం నిర్వహిస్తున్న ప్రతినిధులు
22-11-2026 | 09:41pm
తాడ్వాయి, నవంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలోని నాయకమ్మ ఆలయంలో ఆదివారం 352వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయంలో వార్షికోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా భక్తులు డప్పు వాయిద్యాలతో అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట భక్తిశ్రద్ధలతో యజ్ఞం(Yagnam) నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాయకమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం(Food Donation) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు అంబీర్ నరేందర్ రావు, మనోహర్ రావు, భువనేశ్వర్ రావు, సదాశివనగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, మోడేగామ మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.