అంతా ఆన్లైన్లోనే!
ఉద్యోగుల వివరాల నుంచి అనుమతుల వరకు నేటి నుంచి డిజిటల్ పాలనకు శ్రీకారం
3.48 లక్షల మంది ఉద్యోగుల వివరాలు ఈ-హెచ్ఆర్ఎంఎస్లో నమోదు
సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు ఒకే వేదికపైకి
ఆర్థిక మంజూరులు, టెక్నికల్ శాంక్షన్లు, డీబీటీ చెల్లింపులకూ డిజిటల్ బాట
అక్టోబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ(Telangana Government) పరిపాలనలో డిజిటల్ విప్లవానికి(Digital revolution) రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల(Service records of government employees) నుంచి ఆర్థిక మంజూరులు(Financial Sanctions), ప్రభుత్వ అనుమతులు, అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతుల వరకు వీలైనన్ని పరిపాలనా ప్రక్రియలను ఆన్లైన్ విధానంలోకి(Online method) తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధానాన్ని పాటించేలా ఆదే శాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల కదలిక, అనుమతులు, బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు మరింత పారదర్శకంగా, వేగంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగుల నియామకం, సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్న తులు, వార్షిక గోప్య నివేదికలు (ఏసీఆర్లు) తదితర వివరాలను ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు వివిధ కార్యాలయాలు, శాఖల్లో విడివిడిగా నిర్వహిస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఒకే వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా అవసరమైన వివరాలను సులభంగా పొందేందుకు వీలుంటుంది.
ఈ విధానం అమలుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో గత రెండు, మూడు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. డిజిటల్ వ్యవస్థల వినియోగం, సమాచార నమోదు, ఆన్లైన్ ప్రక్రియల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 38,710 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన డేటా ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి కొత్త విధానాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
అనుమతులు, ఉత్తర్వులూ ఆన్లైన్లోనే..
ప్రభుత్వ పరిపాలనలో ఫైళ్ల కదలికను వేగవంతం చేయడంతో పాటు అనుమతుల జారీలో జాప్యాన్ని తగ్గించేందుకు డిజిటల్ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులను కూడా డిజిటల్ పద్ధతిలోనే జారీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్లు సమాచారం. వివిధ శాఖల మధ్య ఫైళ్ల బదిలీ, ఆమోదాల ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడం ద్వారా ఒక ఫైల్ ఏ అధికారి వద్ద ఉంది? ఏ దశలో పెండింగ్లో ఉంది? అనే వివరాలను తెలుసుకోవడం సులభమవుతుంది.
దీంతో అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గడంతో పాటు, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అధికారులు కూడా నిర్ణీత వ్యవస్థ ప్రకారం ఫైళ్లను పరిశీలించి, ఆమోదించేలా డిజిటల్ విధానం ఉపయోగపడనుంది. ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిధుల మంజూరు, ఆర్థిక అనుమతులు, చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియలను ఆన్లైన్లో నిర్వహించేలా వివిధ వ్యవస్థలను అనుసంధానించాలని యోచిస్తోంది.
ప్రతి శాఖలో నోడల్ అధికారి..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతులను కూడా ఆన్లైన్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి వరకు వివిధ దశల్లో ఇచ్చే టెక్నికల్ శాంక్షన్ల ప్రక్రియను డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పైరవీలకు అడ్డుకట్ట పడేనా?
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ పరిధిలోకి వస్తే ఉద్యోగుల బిల్లుల చెల్లింపులు, సర్వీస్ రికార్డుల నిర్వహణ, అనుమతుల మంజూరులో పారదర్శకత పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఫైళ్ల కదలిక, ఆమోదాల దశలు డిజిటల్గా నమోదవడంతో అనవసర జాప్యాన్ని గుర్తించడం, బాధ్యులను నిర్ధారించడం సులభమవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మానవ ప్రమేయం తగ్గి, నిర్దిష్ట విధివిధానాల ప్రకారం పనులు జరిగితే పైరవీలకు అవకాశం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఈ విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే ఉద్యోగుల వివరాల నమోదు పూర్తిస్థాయిలో జరగడం, సాంకేతిక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం, అధికారులకు నిరంతర శిక్షణ అందించడం కీలకం కానుంది. మొత్తంగా, అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ పరిపాలనా విధానం ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.