పెట్టుబడులు మీవి.. భరోసా మాది

15-10-2026 | 05:35am
  1. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా తీర్చిదిద్దుతాం
  2.    2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
  3. ఆధునిక యుగంలో సమాఖ్యలదే కీలకపాత్ర    
  4. తెలంగాణ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదు
  5. సమాఖ్య- ఆఫ్ కామర్స్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
  6. రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కండి: మంత్రి శ్రీధర్‌బాబు

అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెట్టుబడులు(Investments) పెట్టండి.. ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని అన్నారు. ‘తెలంగాణ రైజింగ్(Telangana Rising) -2047’ లక్ష్య సాధనలో సమాఖ్య ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలు పునిచ్చారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు.

ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని, దీన్ని 10 శాతానికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘సమాఖ్య- ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(Federation of Chambers of Commerce) 2026’ సదస్సులో సీఎం ప్రసంగించారు.  పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, దేశ ప్రగతిపై యువత దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కొత్త తరానికి వాణిజ్య చట్టాలపై(Commercial laws) అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం జరిగేదని, ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందన్నారు. ఆధునిక కాలంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి సమాఖ్యలు దోహదపడుతాయని, కొత్తతరం అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు  ఏర్పాటు చేయడం అభినందనీయమ న్నారు.

ఎలాన్ మస్క్‌తో పోటీ..

అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపడంలో మన దేశ యువత ఎలాన్ మస్క్‌తో పోటీ పడుతోందని సీఎం కొనియాడారు. దేశానికి 2047 చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుంటారని, స్వాతంత్య్ర శత జయంతి ఉత్సవాల నాటికి భారత్ అగ్రస్థానంలో ఉండాలని నిర్దేశించారని గుర్తుచేశారు. జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వంతు వాటా అందిస్తోందని తెలిపారు. అందుకే 2025లో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని చెప్పారు. 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతుందని, ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందుకు రాష్ట్రాల సహకారం అవసరమని మోదీ పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు.  

400 ఏళ్లుగా హైదరాబాద్‌కు గుర్తింపు

అభివృద్ధిలో టోక్యో, సింగపూర్‌తో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా సీఎం స్పష్టం చేశారు. 400 ఏళ్లుగా హైదరాబాద్‌లో కాస్మోపాలిటిన్ వాతావరణం ఉందని, అన్ని రాష్ట్రాలు, దేశాల వారిని ఆదరించే సంస్కృతి ఇక్కడ ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పుడు దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా ఉండేదని, ఆ తరువాత వ్యాపార లావాదేవీలకు ల్యాండ్ మార్క్ హైటెక్ సిటీ ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధిలో వేగం పెరిగిందని, క్యూర్ పరిధిలో ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ‘పెరీ’ పరిధిలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ, రాష్ట్రాన్ని మూ డు భాగాలుగా విభజించి అభివృద్ధిని పట్టాలెక్కించామని, పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 

మూడు విభాగాలుగా విభజన..

రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని -కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని (ప్యూర్) పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఇక మిగిలిన గ్రామీణ ప్రాంతాలను (రేర్)- రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రా సెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధా న్యం ఇస్తామని చెప్పారు. దేశం ఆర్థికంగా బలపడాలంటే మహిళల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. అందుకు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.  

మున్నూరు కాపుల సేవలు ఆదర్శం..

కాపు సామాజికవర్గం నుంచి ఎంతోమంది సినిమా, రాజకీయ రంగాలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులుగా ఎదిగి ఆదర్శంగా నిలిచారని, నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సక్సెస్ స్టోరీస్‌ను నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలన్నారు. ఇప్పటివరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్ర మే ఉన్నారని, మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్‌గా ఎదగాలని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల గురించి మాట్లాడాలని, మిగతా సమయంలో పార్టీలకు అతీతంగా దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.  

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు రండి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌లో డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్-2026’లో  పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు పాల్గొనాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్ ఆయన గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సారించామన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించేలా పరిశ్రమలు, నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏఐ, ఏరోస్పేస్, రక్షణ రంగం రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి తెలిపారు.    రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు