రాజ్‌గోపాల్‌రెడ్డి X రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న రేడియల్ రోడ్డు టెండర్ వివాదం
దూద్ కా దూద్
పానీ కా పానీ!
* సుశీ ఇన్ఫ్రా సంస్థపై(Sushi Infra Company) నేరుగా అనర్హత వేటు వేయడానికి బదులుగా, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కోరి ఉండవచ్చని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్(BRS)కు అనుకూలంగా ఉండే కొన్ని మీడియా వర్గాలు కూడా రాజ్‌గోపాల్ రెడ్డి(Rajgopal Reddy) వ్యక్తంచేసిన ఆందోళనలకు, విమర్శలకు మరింత ప్రచారం కల్పించాయి. దీనితో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అయితే రేడియల్ రోడ్ బిడ్డింగ్(Radial Road Bidding)లో రూ. 600 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై బీజేపీ మాత్రం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా మౌనం వహించడం గమనార్హం.
* సంస్థాగతంగా బలంగా ఉన్న బీఆర్ఎస్, వేగంగా ఎదుగుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు రాజ్‌గోపాల్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉంది. రాజ్‌గోపాల్ రెడ్డికి ఏదైనా పదవి కల్పించడం, లేదా కాంట్రాక్టుల విషయంలో పరిమితమైన, నిర్దిష్టమైన అవకాశాన్ని కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి ఒక రాజీ మార్గాన్ని అన్వేషించవచ్చు. అయితే మంత్రివర్గ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించవద్దని, ప్రశ్నించవద్దని, అలాగే పూర్తి సహకారం అందిస్తానని స్పష్టమైన షరతును విధించవచ్చు. ఇక రాజ్‌గోపాల్ రెడ్డి ముందు పరిమితమైన దారులు మాత్రమే ఉన్నాయి.
తెలంగాణలో ఇటీవల రేడియల్ రోడ్(Radial Road)--2 టెండర్ల చుట్టూ అలుముకున్న వివాదం, అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. దీనితోపాటు ప్రభుత్వ కాంట్రాక్టుల(Government contracts) కేటాయింపుల్లో పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. సుమారు రూ. 3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా.. కోత్వాల్‌గూడ (బుద్వేల్) వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) (ఓఆర్ఆర్) నుంచి నాచారం సమీపంలోని ఎన్‌హెచ్--167ఎన్ వరకు 81.15 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ను నిర్మించాల్సి ఉంది.
ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1 పనులను ఎన్సీసీ లిమిటెడ్‌కు రూ. 1286.03 కోట్లకు (అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా) కేటాయించారు. ప్యాకేజీ-2 ను బీవీఎస్ఆర్కు, ప్యాకేజీ-3 ను జీకేసీకి అప్పగించారు. ఈ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్నాయని విమర్శకులు ఆరోపిస్తు న్నారు. అంతేకాక, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 600 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
సదరు టెండర్ల వ్యవహారంపై మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి(Rajgopal Reddy) అత్యంత తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి చెందిన ‘సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్(Sushi Infra and Mining Limited)’ సంస్థ ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే లోని మూడు ప్యాకేజీలకు బిడ్లను దాఖలు చేసింది. వాస్తవంగా మూడు కంపెనీలు కోట్ చేసిన ధరలతో పోల్చుకుంటే సుశీ ఇన్ఫ్రా సంస్థ దాఖలు చేసిన బిడ్లు దాదాపు రూ. 600 కోట్లు తక్కువగా ఉన్నట్లు సమాచారం.
అయితే, సదరు సంస్థ సమర్పించిన అనుభవ ధృవీకరణ పత్రంపై సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) కౌంటర్ సంతకం లేదనే కారణంతో.. సాంకేతిక మూల్యాంకన (టెక్నికల్) దశలోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. ఇది అత్యంత నిరాధారమైన కారణమని రాజ్‌గోపాల్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. తగిన వివరణ కోరితే తమ కంపెనీ సులభంగా అర్హత సాధించేదని ఆయన పేర్కొన్నారు.
డమ్మీ బిడ్లు దాఖలు అయ్యాయని, టెండర్లలో పాల్గొనకుండా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు, ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చారని ఆయన ఆరోపించారు. ఈ టెండర్లను రద్దు చేయాలని, తమ ఫైనాన్సియల్ బిడ్లను కూడా పరిశీలించాలని కోరుతూ ఆ కంపెనీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఇదే సమయంలో.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. టెండర్లను వెంటనే రద్దు చేయాలని, సమగ్ర విచారణ జరపాలని, అంచనా వ్యయాలు, కోట్ చేసిన ధరలు, తులనాత్మక ప్రకటనలు, సాంకేతిక మూల్యాంకన నివేదికలు, అలాగే ప్రతి అనర్హతకు గల కారణాలను పూర్తిగా బహిరంగపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 30, 2026న గడువు ముగిసిన తర్వాత దాదాపు ఐదు పనిదినాల్లోనే 13 బిడ్లను ఎలా పరిశీలించి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగలిగారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక ప్యాకేజీకి సంబంధించి జీకేసీని అనర్హురాలిగా ప్రకటించి.. మరో ప్యాకేజీకి ఎలా అర్హత కల్పించారనే అంశాలనుకూడా ఆయన ప్రస్తావించారు. ‘సుశీ ఇన్ఫ్రా’ సంస్థ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న.. రూ. 600 కోట్ల నష్టం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బిడ్డింగ్ సరళిని బట్టి ప్రజల్లో ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. విజయవంతమైన ముగ్గురు బిడ్డర్లు.. అంచనాల కంటే 3.0 నుంచి 4.5 శాతం అధికంగా ధరలను కోట్ చేశారు. ప్రతి ఒక్క సంస్థ ఒక ప్యాకేజీలో అత్యంత తక్కువ బిడ్డర్‌గా (ఎల్-1) నిలవగా.. మిగిలిన ప్యాకేజీల్లో ఇతర సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా బిడ్లు సమర్పించినట్టు కనపడుతోంది. దీనిని ఒక ‘కుమ్మక్కు’ వ్యవహారంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సుశీ ఇన్ఫ్రా సంస్థపై నేరుగా అనర్హత వేటు వేయడానికి బదులుగా, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కోరి ఉండవచ్చని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే కొన్ని మీడియా వర్గాలుకూడా రాజ్‌గోపాల్ రెడ్డి వ్యక్తంచేసిన ఆందోళనలను, విమర్శలకు మరింత ప్రచారం కల్పించాయి. దీనితో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అయితే రేడియల్ రోడ్ బిడ్డింగ్‌లో రూ. 600 కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై బీజేపీ మాత్రం ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా మౌనం వహించడం గమనార్హం. ఈ అంశంపై ఆ పార్టీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు.
ఈ ఉదంతం, ముఖ్యమంత్రి శిబిరం నుంచి స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇస్తోందనే విశ్లేషకులు అంటున్నారు. దీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రాజ్‌గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా సేవలు అందించారు. ముఖ్యంగా.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి, భువనగిరి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అధిష్ఠానం ఇచ్చిన హామీమేరకు ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అంతా భావించారు.
అయితే, మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరగడం, ఆయన కుటుంబ సంబంధిత సంస్థను టెండర్ల ప్రక్రియలో అనర్హతకు గురిచేయడం ఆయనలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. అదే సమయంలో ఆయనను పక్కన పెట్టిన భావనకు గురిచేశాయి. ఆయన రాజకీయ ఆశయాలను లేదా వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుత అధికార వ్యవస్థతో కలిసి నడవడమే సరైన మార్గమని ఇతర కాంట్రాక్టర్లకు దీని ద్వారా సంకేతాలు ఇచ్చినట్టుగా అంతర్లీనంగా కనిపిస్తోంది.
న్యాయపరంగా చూస్తే.. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన అర్హతా ప్రమాణాలను నిర్దేశించే అధికారం టెండర్లను ఆహ్వానించే సంస్థకు ఉంటుంది. టెండర్లను ప్రకటించి, డిజిటల్ పద్ధతిలో సమర్పించిన తర్వాత, ఆ ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. టెండర్ ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యం పరిమితంగా ఉంటుంది. స్పష్టమైన చట్టవిరుద్ధత లేదా ఏకపక్ష నిర్ణయం ఉన్నట్టుగా రుజువయితే తప్ప కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు.
సుశీ ఇన్ఫ్రా దాఖలుచేసిన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు.. మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ముగింపు దశలో ఉన్న టెండరు ప్రక్రియను నిలిపివేయడం ప్రజా ప్రయోజనాలకు అనూకూలం కాదని కోర్టు అభిప్రాయపడింది. టెండర్లను దక్కించుకున్న ఎల్--1 బిడ్డర్లను ప్రతివాదులుగా చేర్చాలని సంస్థను ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. లోపాయికారిగా కుమ్మక్కు అయినట్టు స్పష్టమైన ఆధారాలు లేనిపక్షంలో టెండర్ల కేటాయింపులను న్యాయస్థానం రద్దు చేసే అవకాశం తక్కువగా కనపడుతోంది.
ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి వెనుక విస్తృతమైన రాజకీయ వాస్తవాలు ఉన్నట్టుగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక రెండే రెండు ప్రధాన రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలతో సహా పార్టీ జాతీయ ఎన్నికల యంత్రాంగానికి తెలంగాణ గణనీయమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని, నిధులను సమకూరుస్తుందని భావిస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో సంస్థాగత, ఇతర ఎన్నికల అవసరాల కోసం పార్టీకి రూ. 5,000 నుంచి రూ. 7,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు.
ఓటర్లు రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు నగదు ప్రోత్సాహకాలను ఆశిస్తున్న ప్రస్తుత తరుణంలో.. భూముల లావాదేవీలు, నియంత్రిత కాంట్రాక్టు కేటాయింపుల ద్వారా వనరులను సమీకరించడం అధికారిక అవసరంగా మారిందని భావిస్తున్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఈ అంతర్గత వనరుల సమీకరణ మరింత జటిలం కావచ్చు. కేరళ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డికి పెరిగిన రాజకీయ ప్రాధాన్యత, సీనియర్ నేతలకు బదులుగా గోవా సమావేశానికి ఆయన హాజరుకావడం, ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు.. ఇవన్నీ భవిష్యత్తులో పార్టీ అసెంబ్లీ ప్రచారాలలో ఆయన కీలక పాత్ర పోషించే నాయకుడిగా ఎదుగుతున్నారనే సంకేతాలుగా కనపడుతున్నాయి.
అయితే.. ఒక ఆచరణాత్మక పరిష్కారానికి ఇప్పటికీ అవకాశం ఉందనే చెప్పవచ్చు. సంస్థాగతంగా బలంగా ఉన్న బీఆర్ఎస్, వేగంగా ఎదుగుతున్న బీజేపీలను ఎదుర్కొనేందుకు రాజ్‌గోపాల్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉంది. రాజ్‌గోపాల్ రెడ్డికి ఏదైనా పదవి కల్పించడం, లేదా కాంట్రాక్టుల విషయంలో పరిమితమైన, నిర్దిష్టమైన అవకాశాన్ని కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి ఒక రాజీ మార్గాన్ని అన్వేషించవచ్చు. అయితే మంత్రివర్గ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించవద్దని, ప్రశ్నించవద్దని, అలాగే పూర్తి సహకారం అందిస్తానని స్పష్టమైన షరతును విధించవచ్చు.
ఇక రాజ్‌గోపాల్ రెడ్డి ముందు పరిమితమైన దారులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత నాయకత్వ అధికారిక వైఖరిని అంగీకరించడం, ఇతర రాజకీయ మార్గాలను అన్వేషించడం లేదా రాబోయే రెండేళ్లలో జరగనున్న తదుపరి అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిఉండటం లాంటివే కండ్లముందు కనపడుతున్నాయి. అయితే ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుంటారు.. అలాగే తన పాలనా రికార్డును కాపాడుకుంటూ ఈ అంతర్గత రాజకీయ అలజడిని కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది..!
సి.ఎల్.రాజం