ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయం
గుంతలమయమైన కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారి..
గాంధారి, నవంబర్ 4 (విజయ క్రాంతి) : ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన కామారెడ్డిబాన్సువాడ ప్రధాన రహదారి(Kamareddy-Banswada Main Road) ప్రస్తుతం గుంతలమయంగా మారి ప్రయాణికులకు(Travelers) ప్రాణసంకటంగా పరిణమిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు పై నుండి బాన్సువాడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా స్ప్రింగ్ ఫీలడ్స్ పాఠశాల(Springfields School) ముందు, లింగంపల్లిగుడిమెట్ గ్రామాల మధ్య లో, తిమ్మాపూర్ సమీపంలో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన భా రీ గుంత లు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి..
అడుగడుగునా గుంతలే .. ప్రయాణం అంతా ప్రమాదమే!
కామారెడ్డి నుంచి బాన్సువాడకు వెళ్లే ఈ ప్రధాన రహదారి మీదుగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే స్ప్రింగ్ ఫీలడ్స్ పాఠశాల ముందు,లింగంపల్లి- గుడిమెట్ గ్రామాల మధ్య ఉన్న గుంతల వల్ల పలువురు ప్రయాణికులు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడగా, కొంతమంది ప్రాణాలే కోల్పోయారు.. తిమ్మాపూర్ గ్రామ సమీపంలోని భారీ గుంతలు వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం!
పగటిపూట గుంతలను గమనించి వాహనదారులు ఎలాగోలా ప్రయాణిస్తున్నప్పటికీ రాత్రి సమయాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. సరైన వెలుతురు లేక గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోయే ప్రమాదం ఉంది. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు ఒక్కసారిగా పక్కకు మళ్లుతుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ఢీకొనే ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
వాహనాలు దెబ్బతింటున్నాయి.. సమయం వృథా అవుతోంది!
రహదారిపై ఉన్న గుంతల కారణంగా వాహనాల టైర్లు, సస్పెన్షన్ తదితర భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రయాణం సాఫీగా సాగాల్సిన ప్రధాన రహదారిపై గుంతలను తప్పించుకుంటూ నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. అత్యవసర పనులపై వెళ్లేవారు, రోగులను ఆసుపత్రులకు తరలించే వాహనాలు సైతం ఈ రహదారిపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలకు ఈ సమస్య శాశ్వత తలనొప్పిగా మారింది.
ప్రమాదాలు జరిగిన తర్వాతే స్పందిస్తారా?
ప్రధాన రహదారిపై ఇంతటి దుస్థితి నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాత్కాలికంగా గుంతలు పూడ్చడం కాకుండా నాణ్యతా ప్రమాణాలతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు రహదారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, సంబంధిత ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు నుంచి బాన్సువాడ వరకు రహదారిని పూర్తిస్థాయిలో పరిశీలించి, రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను వెంటనే పూడ్చి, నాణ్యమైన మరమ్మతులు చేపట్టాలి. ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు బలికాకముందే అధికారులు మేల్కొని సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు...