కొనుగోలు కేంద్రాలెక్కడ?

05-11-2026 | 05:30am

ప్రారంభంకాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

వెంకటాపూర్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట(Paddy crop) చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా రైతులకు(Farmers') మాత్రం కష్టాలు తప్పడం లేదు. వరి పంట కోతలు ప్రారంభమైనప్పటికీ వెంకటాపురం మండలంలో(Venkatapuram Mandal) ధాన్యం కొనుగోలు కేంద్రాలు(Grain procurement centers) ఇంకా ప్రారంభం కాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోత పెట్టిన రైతులకు ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల జాప్యం

ప్రతి ఏటా పంట చేతికి వచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు జాప్యం చేస్తుండడంతో రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో కోతలు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలి.? ఎక్కడ విక్రయించాలి.? అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు.

వాతావరణ పరిస్థితులపై రైతుల ఆందోళన

మరోవైపు వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండగా కోసిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోతే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని, వారు నిర్ణయించిన ధరలకు ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తాం

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు చేపడతాం. రైతులు ఎవరూ కూడా అధైర్య పడవద్దు. త్వరలోనే పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించకుండా దళారులను నమ్మి మోసపో కుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలి. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.

- చెన్నోజు శ్రీనివాస్, 

వెంకటాపూర్ పిఏసిఎస్ చైర్మన్

మరిన్ని వార్తలు