ఓయూ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
- లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
- సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ముషీరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయ(Osmania University) బోధనేతర ఉద్యోగుల(Non teaching staff) న్యాయమైన డిమాండ్లను వర్సిటీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వర్సిటీ పాలనా యంత్రాంగం విఫలమవడం వల్లే వారు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సమ్మె చేస్తున్న బోధనేతర, సాంకేతిక, టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బీజేపీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు.
బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని రాంచందర్‌రావు సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తనకు, తన కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తాను ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశానని, తన తండ్రి కూడా ఇక్కడే ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారని గుర్తుచేశారు.
దేశానికి ఎంతోమంది మేధావులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులను అందించిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 25 నుంచి 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులను సైతం వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
2001 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని, 2004 తర్వాత నియమితులైన వారికి సీపీఎస్ అమలు చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని, అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అంతర్గత పదోన్నతులు, ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని సూచించారు.
వర్సిటీ ఖాతాల జప్తు పేరుతో ఉద్యోగులకు ఏటా రావాల్సిన రూ.1,500 ఇంక్రిమెంట్‌ను నిలిపివేయడం, పీఎఫ్ పేరుతో వారి ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించడం సరికాదన్నారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటం, నిరసన తెలిపిన వారిపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికమని రాంచందర్ రావు మండిపడ్డారు.
ఓయూ పూర్వ విద్యార్థిగా, లా కాలేజీ మాజీ అలూమ్ని ప్రెసిడెంట్‌గా విశ్వవిద్యాలయ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు మొండివైఖరి వీడి బోధనేతర ఉద్యోగ జేఏసీ నాయకులను వెంటనే చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యోగుల పోరాటానికి బీజేపీ ప్రత్యక్షంగా అండగా నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.