సమావేశాలతోనే సరి!?
45 రోజులకోసారి సమీక్షలు.. అయినా గ్రామాల్లో మారని పరిస్థితులు!
రేపు మండల సర్వసభ్య సమావేశం
కౌటాల, నవంబర్ 4 (విజయక్రాంతి): మండల సర్వసభ్య సమావేశాలు(Mandal General Body Meetings) జరుగుతున్నాయి.. అధికారులు, ప్రజాప్రతినిధులు(Officials and public representatives) హాజరవుతున్నారు.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చిస్తున్నారు.. కానీ సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి సర్పంచులు, మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చర్చలకే పరిమితమవుతున్న సమావేశాలు?
కౌటాల ఎంపీడీఓ కార్యాలయంలో(Koutala MPDO Office) శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఎన్ని పనులు పూర్తయ్యాయి? అనే అంశాలపై స్పష్టమైన సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో సమస్యల తిష్ట
మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సమస్యలను సమావేశాల్లో ప్రస్తా విస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిష్కారం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన సమస్యలకు అధికారులు హామీలు ఇవ్వడానికే పరిమితమవు తున్నారా? లేక వాటి పరిష్కారానికి నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమావేశాల ఫలితాలు ఏమిటి?
ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం గ్రామాల సమస్యలను గుర్తించి సకాలంలో పరిష్కరించడమే. అయితే సమావేశాల నిర్వహణతోనే బాధ్యత ముగియకుండా, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా సమీక్ష జరగాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యల వారీగా బాధ్యులైన అధికారులను గుర్తించి, పరిష్కారానికి గడువు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. నేడు జరగనున్న సమావేశంలోనైనా గ్రామాల సమస్యలపై లోతైన చర్చ జరిగి, క్షేత్రస్థాయిలో పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తారా? లేక మరోసారి చర్చలకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాలి.