55 గ్రామాలు.. 137 గొలుసు దుకాణాలు

05-11-2026 | 05:25am
  1. మద్యానికి చిరునామాగా కిరాణా కొట్లు
  2. పలు గ్రామాల్లో ఇళ్లలోనే సిట్టింగులు
  3.    24 గంటలు అందుబాటులో మద్యం 
  4. కుర్తివాడ ఫుడ్ కోర్ట్‌లో మద్యం సిట్టింగ్ 
  5. నిబంధనలు బేఖాతరు.. 
  6. నలిగిపోతున్న సామాన్యులు 

పాపన్నపేట, నవంబర్ 4: మండల పరిధిలోని కుర్తివాడ శివారులో మెదక్-బొడుమటిపల్లి ప్రధాన రహదారి(Medak-Bodumatipalli Main Road) పక్కనే ఉన్న ఫుడ్ కోర్టులో(Food Court) ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్(Drinking session) నిర్వహిస్తున్నారు. మటన్, చికెన్, ఫిష్, బోటి తరహాలో రోటీలు, రైస్ సైతం తయారుచేసి అందించడంతో అర్ధరాత్రి వరకు వ్యవహారం సాగుతోంది. దీంతో మద్యం సేవించి వాహనాలపై ఇళ్ళకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మద్యం ఏరులై పారుతుంది. ఆలయ సమీపంలో సుమారు 45 వరకు కిరాణా దుకాణాలు ఉండగా వాటిల్లో 30 వరకు మద్యం గొలుసు దుకాణాలుగా కొనసాగుతున్నాయి. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసే జరుగుతోందని అక్కడి ప్రజలు, భక్తులు చెబుతున్నారు.

మండల పరిధిలోని గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ఒక్కో గ్రామం లో రెండు, మూడు చొప్పున మద్యం గొలుసు దుకాణాలుగా చలామణి అవుతున్నాయి. ఈ తథాంగమంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా వారు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు బాహటంగానే చెబుతున్నారు. 

మత్తు వీడని అధికారులు..

 ప్రభుత్వం గొలుసు దుకాణాలపై ఎంత కఠినంగా ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో మూడు సీసాలు, 12 గ్లాసుల చందాన వీటి నిర్వహణ సాఫీగా సాగిపోతోంది. గ్రామస్తుల నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ప్రసిద్ధ పు ణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో సైతం ఇదే తరహాలో 24 గంటలు మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు చేస్తే ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

తాగునీరు కష్టం.. మద్యం పుష్కలం..

పాపన్నపేట మండలంలో మొత్తం 40 పంచాయితీలు ఉండగా 55 గ్రామాలు ఉన్నాయి. అందులో 45 వరకు గ్రామాల్లో ఒక్కో గ్రామంలో మూడు వరకు మద్యం గొలుసు దుకాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఐదు వరకు దుకాణాలు ఉన్నాయి. తాగునీరైనా దొరకడం కష్టమవుతుందేమో కానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో మద్యం ప్రియులు అర్ధరాత్రుల వరకు వారి ఇళ్లు, దుకాణాలు, హోటళ్లలో మద్యం తాగుతున్నారు. 

24 గంటలూ అందుబాటులో..

 మద్యం గొలుసు దుకాణాలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో గ్రామాల్లోని కొందరు మద్యం ప్రియులు నిద్రలేవగానే మద్యంతోనే ముఖం కడుగుతున్నారు. ఒక్కో సీసాపై రూ. 30 నుంచి 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. మద్యం గొలుసు దుకాణం నిర్వాహకులు కొందరికి ముడుపులు ఇచ్చి జోరుగా అమ్మగాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 

చిత్తవుతున్న సాధారణ ప్రజలు..

మద్యం గొలుసు దుకాణాలు నిత్యం అందుబాటులో ఉండటంతో సామాన్య ప్రజలు మత్తులో చిత్తయిపోతున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. గొలుసు దుకాణాలు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో కుటుంబాల్లో కలహాలు పెరిగిపోయి పరిస్థితులు తారుమారు అవుతుండటంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ పెద్ద మధ్యానికి బానిసై పోషణను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.

కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతాం..

 గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు మా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా గ్రామాల్లో గొలుసు దుకాణాలు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తుంటే మాకు సమాచారం ఇస్తే దాడులు చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై విక్రయించకుండా కఠిన చర్యలు చేపడతాం.

 వెంకటేష్, ఎక్సైజ్ శాఖ సీఐ, మెదక్

మరిన్ని వార్తలు