రెండు ఇళ్లలో దొంగతనం.. పోలీసుల చేతికి ఇద్దరు!

12-11-2026 | 12:54pm

బాన్సువాడ, నవంబర్ 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రెండు ఇళ్లలో జరిగిన చోరీ కేసులను పోలీసులు (Police) ఛేదించారు. ఈ ఘటనలకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ వెల్లడించారు.

బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గత నెల అక్టోబర్ 26న తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 తులాల వెండి పట్ట గొలుసులు, 16 తులాల వెండి కడియాలు, రూ.2 వేల నగదును అపహరించారు.

అదేవిధంగా ఈ నెల నవంబర్ 4న హరిజనవాడ ప్రాంతంలో మరో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 9.8 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు (Investigation) చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా బుధవారం మధ్యాహ్నం బాన్సువాడ బస్టాండ్ ప్రాంతంలో అనుమానితులను గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. అరెస్టయిన వారిలో జాదవ్ రావ్ సందీప్ ఉన్నట్లు వెల్లడించారు. నిందితులను విచారించగా చోరీ చేసిన 29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరో నిందితుడు షాదాబ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. అరెస్టయిన ఇద్దరు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఎస్‌ఐ శిరీష, హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పాండురంగ, సుదర్శన్ రావు, పృద్వి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని వార్తలు