ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెపై ఎమ్మెల్యే ఫైర్

18-10-2026 | 09:43am

కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గడీల పాలనను తలపిస్తోందని, ప్రభుత్వంలో నిరంకుశ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి, ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. సమ్మెలో పాల్గొన్న ఓ మహిళా ఉద్యోగి నాలుగు నెలల చంటిపాపను ఎత్తుకుని ఎండలో కూర్చోవడం చూసి ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న ఉద్యోగులకు కనీసం నీడ కల్పించేందుకు టెంట్ వేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఉద్యోగులను, వారి చంటిపిల్లలను మండుటెండలో రోడ్డుపై కూర్చోబెట్టడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.

ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, 'సమాన పనికి సమాన వేతనం' (Equal Pay for Equal Work) సూత్రాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు.

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేపడుతున్న న్యాయమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు