వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
నాగిరెడ్డిపేట్, నవంబర్ 17 (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీపై సమగ్ర సమీక్ష మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు పరిధిలోని గ్రామాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణాల రికవరీ,మొండి బకాయిల వసూళ్లు, బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాల సాధనపై CBRM (Community Based Recovery Mechanism) సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బ్యాంకు పరిధిలోని గ్రామాల వారీగా, వివోఏల వారీగా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన బ్యాంకు రుణాల చెల్లింపుల పురోగతిని సమీక్షించారు.దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రుణ బకాయిలను గుర్తించి,వాటి వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ...ప్రతి గ్రామంలోని అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలన్నింటికీ బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా సిసిలు,వివోఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా, బ్యాంకు రుణాల రికవరీని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని,ప్రతి గ్రామంలోనూ బకాయిలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, దీర్ఘకాలిక మొండి బకాయిలను సైతం ప్రణాళికాబద్ధంగా వసూలు చేసేలా సిసిలు, వివోఏలు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
యూనియన్ బ్యాంకు మేనేజర్ పవన్ మాట్లాడుతూ... స్వయం సహాయక సంఘాలు గతంలో తీసుకున్న రుణ బకాయిలను పూర్తిగా చెల్లించి,ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే తిరిగి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు పొందేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. సంఘాల సభ్యులు సకాలంలో రుణ వాయిదాలు చెల్లించి బ్యాంకులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు.మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు సుమారు 5 కోట్ల పైబడి రుణాలు అందించామని, సక్రమంగా నడిచే సంఘాలకు మరిన్ని బ్యాంకు రుణాలు అందిస్తామని తెలిపారు.
కొత్త రుణాలు అందించడంతో పాటు,ఇప్పటికే మంజూరైన రుణాల రికవరీని మెరుగుపరచడం,మొండి బకాయిలను తగ్గించడం, బ్యాంకు లింకేజీ లక్ష్యాలను సాధించడం వంటి అంశాలపై సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో చర్చించినైనది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ గౌరవ్ షిండే, సిసిలు రాజు, నజీర్, రవి, రాజయ్య, సావిత్రి, అకౌంటెంట్ రాజు వివోఏలు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.