అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
భర్త, అత్తమామల వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
జుక్కల్, బిచ్కుంద, నవంబర్ 22 (విజయక్రాంతి): అదనపు కట్నం కోసం అత్తగారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బిచ్కుంద మండలం(Bichkunda mandal)లోని గోవన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై గుండె రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గిరీష ను అత్తమామలు భర్త కలిసి మానసికంగా, శారీరకంగా వేధించారని, అదనపు వరకట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గిరీష కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
గిరీశాకు గత ఫిబ్రవరి నెలలో బోధన్ పట్టణంలోని వీరేందర్ రాజుతో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద వరుడికి రూ.40 లక్షల నగదు, లక్ష విలువైన బంగారం, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు.
వేధింపులు భరించలేక గిరీష రెండు నెలల క్రితం గోపనపల్లికి వచ్చిందన్నారు. రోజు రోజుకు వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించినట్లు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. గిరీష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.