ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని చింతగూడ రైతు వేదికలో శనివారం ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై, ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త మహేష్ మాట్లాడుతూ... ఎల్‌నినో పరిస్థితుల కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి, పగటిపూట సాపేక్ష ఆర్ద్రత (RH) తగ్గుతుందని తెలిపారు.
దీంతో పంటల్లో తేమ వేగంగా ఆవిరైపోయి మొక్కల ఎదుగుదల, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ తోటల్లో నీటి యాజమాన్యం, నేలలో తేమ సంరక్షణ, మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉద్యాన అధికారి కె. సహజ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న వివిధ రాయితీలు, సబ్సిడీ పథకాలను వివరించారు.