ఎంబీబీఎస్ విద్యార్థికి మంత్రి పొంగులేటి ఆర్థిక సాయం
* మైనారిటీ గ్రామీణ వైద్యుల కార్తీక మాస వన సమారాధనలో మంత్రి పొంగులేటి ఔదార్యం
ఖమ్మం: చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం(Minority Rural Doctors' Association) వారి కార్తీక మాస వన సమారాధన జరగగా.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. మైనార్టీలకు అన్ని విధాల అండగా ఉంటానని అభయమిచ్చారు.
చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మదార్ సాబ్ కుమారుడు హుస్సేన్ జాఫర్ ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో(Medical College) ఎంబీబీఎస్ సీటు(MBBS seat) సాధించాడని సంఘం నిర్వాహకులు తెలపగా.. మంత్రి వెంటనే ఆ యువకుడిని అభినందించి రూ.25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
అలాగే కోయచెలక గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి యాసీన్ కుమారుడు ఎస్.కె.అద్నాన్ ఇటీవల ముంబైలో జరిగిన కరాటే పోటీల్లో పతకం సాధించగా.. మంత్రి పొంగులేటి అభినందించి రూ. 5వేలు ప్రోత్సాహకం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నజీరుద్దీన్, గౌరవ అధ్యక్షులు హసన్, కార్యదర్శి జానీమియా, ఉపాధ్యక్షులు చాంద్ పాషా, తూటికుంట్ల ఖాసీం, ఆశ, ఆమీర్ తదితరులు పాల్గొన్నారు.