హిట్ సినిమాకు రెమ్యునరేషన్ సున్నా
ముంబై: ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) తన కెరీర్‌లోని ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని బయటపెట్టారు. సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘రాక్‌స్టార్’ సినిమాకు పనిచేసినందుకు తనకు నిర్మాత నుంచి ఎలాంటి పారితోషికం అందలేదని వెల్లడించారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, నర్గీస్ ఫక్రీ నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సంగీతం తనకు నచ్చలేదని నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రెహమాన్ గుర్తుచేసుకున్నారు. ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇతర సంగీతకారుల పారితోషికాలు, తన ప్రయాణ ఖర్చులను సైతం స్వయంగా భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని దర్శకుడు ఇంతియాజ్ అలీకి కూడా అప్పట్లో చెప్పలేదని వెల్లడించారు.
పారితోషికం లేకున్నా.. పాటలకు మాత్రం భారీ గుర్తింపు: నిర్మాత నుంచి ఆశించిన పారితోషికం అందకపోయినా ‘రాక్‌స్టార్’ సంగీతం మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ‘సద్దా హక్’, ‘నాదాన్ పరిందే’, ‘కున్ ఫయా కున్’, ‘ఫిర్ సే ఉద్ చలా’ వంటి పాటలు ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఆల్బమ్‌కు రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి ‘రామాయణ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఒకవైపు పారితోషికం అందని అనుభవం.. మరోవైపు అదే సినిమాకు సంగీతపరంగా వచ్చిన అద్భుతమైన గుర్తింపు.. రెహమాన్ వెల్లడించిన ఈ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.