ఒడిదుడుకుల్లోనూ టాటా ఫండ్ జోరు!

29-11-2026 | 07:25pm

హైదరాబాద్, నవంబర్ 27: స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్‌లో ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది. టాటా ఆర్బిట్రేజ్ ఫండ్(Tata Arbitrage Fund) నిర్వహణలో ఉన్న ఆస్తుల నెలవారీ సగటు విలువ (MAAUM) ఏప్రిల్ 2026లో రూ.1,288.38 కోట్లుగా ఉండగా, అక్టోబర్ నాటికి రూ.1,540.24 కోట్లకు చేరింది. దీంతో ఆరు నెలల్లోనే సుమారు 20 శాతం వృద్ధి నమోదైంది.

అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో ఈ ఫండ్ రూ.49.18 కోట్ల స్థూల అమ్మకాలను నమోదు చేసింది. మరోవైపు మార్కెట్ పరిస్థితులు కూడా ఆర్బిట్రేజ్ ఫండ్లకు అనుకూలంగా మారుతున్నాయి. అక్టోబర్‌లో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లలోకి రూ.3,514 కోట్ల నికర పెట్టుబడులు రాగా, అందులో ఆర్బిట్రేజ్ ఫండ్లు కీలక పాత్ర పోషించాయి. సెప్టెంబర్‌లో రూ.3,956.38 కోట్ల నికర ఉపసంహరణలు ఎదుర్కొన్న ఈ విభాగం అక్టోబర్‌లో రూ.3,928.89 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం విశేషం.

మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఆర్బిట్రేజ్ ఫండ్లపై ఆసక్తి:

ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల్లో మార్పులు పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి. ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకునే వ్యూహంతో ఆర్బిట్రేజ్ ఫండ్లు పనిచేస్తాయి. స్వల్పకాలిక వడ్డీ రేట్లు, ఫ్యూచర్స్ ప్రీమియం వంటి అంశాలు వీటి రాబడులపై ప్రభావం చూపుతాయి.

అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులు సెప్టెంబర్‌లోని రూ.38,306.55 కోట్ల నుంచి రూ.32,993.64 కోట్లకు తగ్గడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టాటా ఆర్బిట్రేజ్ ఫండ్ నిర్వహణ ఆస్తులు పెరగడం పెట్టుబడిదారుల ఆసక్తిని సూచిస్తోంది. అయితే ఆర్బిట్రేజ్ ఫండ్లలోనూ మార్కెట్, క్రెడిట్, లిక్విడిటీ, ఖర్చులకు సంబంధించిన రిస్కులు ఉంటాయని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి.

మరిన్ని వార్తలు