వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎక్కడ..?
- ధాన్యం విక్రయానికి రైతుల ఎదురుచూపులు
- పంట పండించినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత కరువు!
కన్నాయిగూడెం,నవంబర్ 18 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి, వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట పండించిన రైతులకు ధాన్యం విక్రయించడం భారంగా మారుతోంది. పంట సాగు సమయంలో అడవి పందులు, కోతుల బెడదను తట్టుకుని పంటను కాపాడుకుంటే.. ఇప్పుడు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఈసారి కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ధాన్యాన్ని కోతలు కోయించి, నూర్పిడి చేసి నిల్వ చేసుకుంటున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ముందస్తు ప్రణాళిక రూపొందించి, అవసరమైన చోట కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులను దళారుల పాలు చేస్తారా?
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోతే రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రారంభ తేదీలపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
కన్నాయిగూడెం మండలం వ్యాప్తంగా 2వేల ఎకరాల్లో వరి పంట వేశారు. గత 10రోజుల నుంచి మండలంలో వరి కోతలు మొదలు అయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కారణంగా రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సన్న వడ్ల పంటలు వేసిన రైతులు దళారులకు అమ్మడం కారణంగా ప్రభుత్వం ఇచ్చే బోనస్ రాకుండా పోతుంది. తక్షణమే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
దుర్గం రాజ్ కుమార్, బుట్టాయిగూడెం