స్పార్క్ మైండ్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
- లీజ్ గడువు ముగిసినా కొనసాగుతున్న పాఠశాల నిర్వహణ...
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా...?
- బాన్సువాడ ఆర్డీఓకు విద్యార్థి సంఘాల వినతి
బాన్సువాడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్పార్క్ మైండ్ పాఠశాల(Spark Mind School) నిర్వహణ తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాఠశాల భవనానికి సంబంధించిన లీజ్ డీడ్ గడువు ముగిసినప్పటికీ, కొత్త లీజ్ ఒప్పందం చేసుకోకుండా పాఠశాలను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ పిడిఎస్ఎఫ్, డి ఎస్ ఎఫ్ ఐ, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఎన్. బాల్రాజ్, జీవన్ రాథోడ్, అర్ఫాత్ మాట్లాడుతూ స్పార్క్ మైండ్ పాఠశాల భవనానికి సంబంధించిన లీజ్ ఒప్పందం గడువు ఇప్పటికే ముగిసిందని తెలిపారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం కొత్త లీజ్ అగ్రిమెంట్ చేసుకోకుండా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అంతేకాకుండా, సదరు భవనాన్ని ఇకపై పాఠశాలకు అద్దెకు ఇవ్వబోమని భవన యజమాని సంబంధిత ఎంఈఓ నాగేశ్వరరావు కు లిఖితపూర్వకంగా సమాచారం అందించినట్లు నాయకులు పేర్కొన్నారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం ప్రత్యామ్నాయ భవనానికి మారేందుకు అవసరమైన షిఫ్టింగ్ అనుమతులు పొందలేదని,
ప్రస్తుత భవనానికి సంబంధించి యజమానితో కొత్త లీజ్ ఒప్పందం కూడా చేసుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.స్పార్క్ మైండ్ పాఠశాల భవనానికి సంబంధించిన లీజ్ ఒప్పందం, షిఫ్టింగ్ అనుమతులు, పాఠశాల నిర్వహణకు ఉన్న అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా న్యాయం చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.