మంజీరాలో నీరు కరువు.. దాహంతో గ్రామాల బాట పడుతున్న జింకలు!

16-11-2026 | 04:22pm

– అడవుల్లో నీటి జాడ లేక వన్యప్రాణులకు కష్టాలు

– గ్రామ శివార్లలో జింకల సంచారం.. రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

నాగల్‌గిద్ద, నవంబర్ 16 (విజయక్రాంతి): మంజీరా నదిలో నీరు లేకపోవడంతో అటవీ ప్రాంతాల్లో(Nagalgidda Forest Area)ని వన్యప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జింకలకు తాగునీరు అందుబాటులో లేకపోవడంతో దాహం తీర్చుకునేందుకు గ్రామాల శివార్లలోకి వస్తున్నాయని తెలిపారు. నాగల్‌గిద్ద మండలంలోని కారాముంగి, మోర్గి, కరస్‌గుత్తి, శిఖర్‌ఖానా, అవుదాపూర్,గొందేగోవ్  తదితర గ్రామాల పరిసర ప్రాంతాల్లో జింకలు గుంపులుగా సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఒకవైపు అడవుల్లో నీటి వనరులు లేక, మరోవైపు మంజీరా నదిలో నీరు లేక జింకలు దాహంతో అల్లాడుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నీటి కోసం గ్రామాల వైపు వస్తున్న జింకలకు ప్రమాదం పొంచి ఉందని, వాటి సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అడవుల్లో అక్కడక్కడా నీటి తొట్లు, నీటి కుంటలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చి వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు చొరవ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు