ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు
- జనవరి 20 నుంచి ఇంటర్నల్ అసెస్మెంట్
- 29, 30 తేదీల్లో ప్రాక్టికల్స్
- షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఇంటర్ బోర్డు(Telangana Inter Board) గురువారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
వొకేషనల్ విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయని, టైమ్బుల్ను వేరుగా విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఇక జనవరి 20 నుంచి 25 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతాయి. జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, జనవరి 29న అదే సమయంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 29న ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, జనవరి 30న సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి.
సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో సహా ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇక కొత్త విధానంలో ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ఆదివారం కూడా కలుపుకుని రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది. సెషన్-1 ఉదయం 9 నుంచి 11 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు, సెషన్-3 మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుంది.
ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు..
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్- 1ఎ, బోటనీ పేపర్- 1, పొలిటికల్ సైన్స్ పేపర్- 1, అకౌంటెన్సీ పేపర్-1 (ఏసీఈ గ్రూప్) పరీక్షలు ఉంటాయి. మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, కామర్స్ పేపర్-1 (ఏసీఈ గ్రూప్) నిర్వహిస్తారు.
మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, ఎంఈసీ గ్రూప్‌కు మ్యాథమెటిక్స్ పేపర్-1 (సింగిల్ పేపర్) ఉంటాయి. మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు.
సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలు...
సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2, మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 పరీక్షలతో ముగుస్తాయి.