ప్రజాపాలన కాదు.. అవినీతి పాలన

20-11-2026 | 05:10am
  1. 20 శాతం కమీషన్ ఇస్తేనే పనులు
  2. అనిరుధ్, రాజగోపాల్ వ్యాఖ్యలతో బండారం బట్టబయలు
  3. అవినీతి సొమ్మును కక్కిస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం
  4. ఏడాది తర్వాత వచ్చేది మేమే
  5. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ మండిపాటు
  6. ఢిల్లీ నేతలు వచ్చినప్పుడల్లా రేవంత్‌రెడ్డికి వణుకేనని విమర్శలు 
  7. భూపాలపల్లి నుంచి బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాల న కాదని, అవినీతి పాలన అని.. 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు. ‘రాష్ట్రంలో పర్సంటేజీ ఇవ్వనిదే ఏ పనీ కావడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి(MLA Anirudh Reddy) స్వయంగా చెప్పారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో కుంభకోణాల ఆరోపణలు చేస్తున్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుండటం కాంగ్రెస్ పాలన దుస్థితికి నిదర్శనం’ అని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా ప్రపంచ బ్యాంకుకు అర్జీలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశా రు. ‘ఉన్న నిధులన్నీ కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని, తాము కేవలం పెళ్లిళ్లు, చావులకు పరిమితమయ్యామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వంలోని మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి’ అని  కేటీఆర్ పేర్కొన్నారు. 

గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. అవినీతి సొమ్ము ఓటుకు రూ.15 వేలు ఇచ్చి కొనుగోలు చేయవచ్చని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని, డబ్బులు పంచితే జనం తనకే ఓటు వేస్తారనే భ్రమలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. ఏడాది తర్వాత వచ్చేది గులాబీ జెండానేనని, కాంగ్రెస్ నాయకులు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, ఎవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. 

కొత్త పింఛన్ల పేరుతో మోసం

కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో  రాష్ట్రంలో 44 లక్షల 70 వేల పెన్షన్లు ఉండేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది 1.50 లక్షలు, రెండో సంవత్సరం 1.50 లక్షలు, మూడో ఏడాది 1.70 లక్షల పెన్షన్లు తొలగించిందని.. మొత్తం 4.70 లక్షల  పెన్షన్లు కోత పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది 4 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమేనని, తొలగించిన వాటితో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి 7 వేలు తక్కువని వివరించారు.

పెన్షన్లు పెంచితే బడ్జెట్ ఎందుకు పెరగలేదని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్.. మూడు డిసెంబర్‌లు గడిచినా ఒక్క రూపాయి కూడా పెంచలేదని మండిపడ్డారు. వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం  పింఛన్‌ను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని, కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే రూ.4 వేలు చేసేదని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని డిప్యూటీ సెం భట్టి విక్రమార్క ఎన్నికల అఫిడవిట్‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. గ్యారంటీ కార్డులను క్రెడిట్ కార్డుల్లా భద్రంగా పెట్టుకోవాలని చెప్పిన నాయకులు, మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఢిల్లీ పార్టీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డి వణికిపోతున్నారని, ప్రియాంకగాంధీ వచ్చినప్పుడు బాడీగార్డులా పక్కకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి వెనుక పరుగులు తీశారని విమర్శించారు.

బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందని, అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాంచందర్‌రావు ఆయన కాళ్లు మొక్కడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టడమేనని విమర్శించారు.  తెలంగాణ నేతలు మళ్లీ ఢిల్లీ పార్టీలకు గులాములుగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పైసలు ఢిల్లీకి పోతున్నాయని, ఢిల్లీ పెద్దలకు చెల్లించాల్సిన ఈఎంఐలు కట్టకపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవి పోతుందని ఎద్దేవా చేశారు. అందుకే రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. భూపాలపల్లి ప్రాంతాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు