భారత్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు

20-11-2026 | 05:05am

ముంబై: 2030 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్(Amazon) నేడు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తన పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించడంతో పాటు, మరింత సుస్థిరమైన, పటిష్టమైన ఇంధన భవిష్యత్తు దిశగా భారత్ సాగేందుకు మద్దతు అందించనుంది. ఇప్పటికే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం అమెజాన్ ఒప్పందం చేసుకున్న 4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనం.

ఈ విస్తరణతో భారతదేశంలో కార్బన్ రహిత ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో అమెజాన్ ఒకటిగా నిలవనుంది. అమెజాన్ మొత్తం 934 మెగావాట్ల (MW) స్థాపిత సామర్థ్యంతో నాలుగు కొత్త భారీ స్థాయి పవన, సౌర ఇంధన ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. వీటిలో కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ (ఆసియాలో ఇప్పటివరకు అమెజాన్ ఒప్పందం కుదుర్చుకున్న అతిపెద్ద పవన విద్యుత్ ప్రాజెక్ట్), కర్ణాటకలోనే 200 మెగావాట్ల సంయుక్త సౌర, పవన విద్యుత్ ప్రాజెక్ట్, మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్, రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఉన్నాయి.

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (PPAs) ద్వారా ఈ ప్రాజెక్టులను అమెజాన్ దక్కించుకుంది. ఇవి భారతదేశంలో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న 4 బిలియన్ డాలర్ల విలువైన అమెజాన్ ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత, వాటి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2 గిగావాట్ల (GW)కు మించనుంది. ఇది 35 లక్షలకు పైగా భారతీయ కుటుంబాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.

భారతదేశంలో అమెజాన్ చేపడుతున్న పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు, 2030 నాటికి తన కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్ వినియోగంలో కార్బన్ తీవ్రతను 65% తగ్గించాలనే కొత్త ప్రపంచ లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడనున్నాయి. “భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అమెజాన్ నిరంతరంగా పెట్టుబడులు పెడుతుండటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇటువంటి పెట్టుబడులు దేశ స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాధనకు, ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, సుస్థిర ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే “భారతదేశంలో మా పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు అనేక సంవత్సరాలుగా సాగుతున్న నిరంతర కృషి, ప్రణాళికాబద్ధమైన చర్యలు, పరిశ్రమలోని వివిధ భాగస్వాములతో కూడిన సహకారానికి నిదర్శనం. అదనంగా ప్రకటించిన 7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి మా దీర్ఘకాలిక నిబద్ధతను స్పష్టం చేస్తోంది. ఇది మరింత పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భారతదేశ ఇంధన భద్రతకు, దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు దోహదపడుతుందనీ అమెజాన్ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ కారా హర్స్ట్  తెలిపారు.

మరిన్ని వార్తలు