క్యాబ్ డ్రైవర్లకు శాపంగా గ్రీన్ ఎస్‌ఎం!

13-11-2026 | 05:05am

కమీషన్ల కోసం 6 లక్షల మంది జీవితాలతో చెలగాటం

క్యాబ్ డ్రైవర్లకు వెంటనే రేట్ కార్డు ప్రకటించాలి

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్ల పొట్టకొట్టేలా గ్రీన్ ఎస్‌ఎం విధానాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(BRS General Secretary RS Praveen Kumar) పేర్కొన్నారు. ఆ కంపెనీకి అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు సుమారు 6 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శాపంగా మారనున్నాయని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

విదేశీ పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని, వాటి వల్ల స్థానికుల ఉపాధికి నష్టం కలిగించడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేటీఆర్ సారథ్యంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయని, వాటి వల్ల ఎవరికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్‌ఎం కంపెనీకి హైదరాబాద్‌లో కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఇక్కడి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బేస్ ఫేర్ కంటే 50 శాతం తక్కువ ధరకు సేవలు అందించకూడదన్న నిబంధన ఉండగా, గ్రీన్ ఎస్‌ఎం కంపెనీ కిలోమీటరుకు రూ.8 మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

జియో తరహాలో మొదట తక్కువ ధరలతో ప్రయాణికులను ఆకర్షించి, తర్వాత చార్జీలు పెంచే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ‘కంపెనీ డ్రైవర్ కాదు.. పార్ట్‌నర్ కండి’ అనే నినాదం వెనక కార్మికుల ప్రయోజనాలను విస్మరించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వారానికి రూ.8 వేలు చెల్లిస్తామంటూనే 500 కిలోమీటర్ల షరతు పెట్టడం వారి ఉపాధిని దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు. ఆటో డ్రైవర్ల మాదిరి క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆటోలకు జీవో 46ను సవరించి అదనపు కిలోమీటర్‌కు ప్రస్తుతం ఉన్న రూ.14ను రూ.24కు పెంచాలన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేల ఆర్థికసాయం అమలు చేయాలని కోరారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ చేస్తున్న ఆందోళనలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 


మరిన్ని వార్తలు