వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు

13-11-2026 | 05:05am
  1. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
  2. తనను తాను కాల్చుకుని నిందితుడి ఆత్మహత్య
  3. దర్యాప్తు చేపట్టిన యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ

వాషింగ్టన్, నవంబర్ 12: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌(White House)కు అత్యంత సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తు తెలియని దుండగుడు వాషింగ్టన్ డీసీకి 1.5 కి.మీ. దూరంలో ఉన్న లోగన్ సర్కిల్ 15వ వీధి, 1500వ బ్లాక్‌లో ఉన్న విడా ఫిట్‌నెస్ సెంటర్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హతాశయులైన ఫిట్‌నెస్ సెంటర్‌లోని వ్యక్తులు ఉరుకులు పరుగులు పెట్టి పోలీసులకు సమాచారం అందజేశారు.

నిందితుడు అక్కడి నుంచి బయటకు వెళుతూ మరింత మందిపై కాల్పులకు తెగబడగా నలుగురికి బుల్లెట్ గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసు ఉన్నతాధికారి జెఫరీ డబ్ల్యూ కారోల్ మీడియాకు వివరాలందించారు. స్థానికుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్నామని తెలిపారు. అప్పటికే నిందితుడు కాల్పులు జరిపిన ప్రాంతం నుంచి బయటికి వచ్చి మరో భవనంలోకి చొరబడ్డాడని తెలిపారు.

నిందితున్ని అరెస్టు చేసేందుకు నేషనల్ గార్డులు ప్రయత్నించగా వారిపై కూడా కాల్పులు జరుపుతానని బెదిరించాడన్నారు. కొన్ని గంటల తరువాత నిందితుడు నక్కిన భవనం నుంచి కాల్పుల శబ్దం రాగా పోలీసులు ఆ భవనంలోకి వెళ్లారని అప్పటికే తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కాగా నిందితునికి భవన యజమానితో వివాదం ఉన్నట్లుగా అనుమానిస్తున్నామని ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పూర్తి ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. కాల్పుల ఘటనపై యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. వాషింగ్టన్ డీసీ కౌన్సిల్ సభ్యురాలు బ్రూక్ పింటో కాల్పులను ధృవీకరిస్తూ తీవ్రంగా ఖండించారు. 

మరిన్ని వార్తలు