మిఠాయి బండారం బట్టబయలు!

01-11-2026 | 05:10am
  1. స్వీట్ల తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రత
  2. ఐదు దుకాణాల మూసివేత
  3. క్యూర్ పరిధిలో 16 షాపుల్లో తనిఖీలు
  4. రూ.16.86 లక్షల పదార్థాలు స్వాధీనం

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): చూడగానే నోరూరే మిఠాయి తయారీలోనూ నాసిరకం పదార్థాల వాడకం గుట్టురట్టయింది. పలు దుకాణాల్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణం బయటపడింది. ఈగలు, బొద్దింకలు, ఎలుకల సంచారం వెలుగులోకి వచ్చింది. స్వీట్ల తయారీ, విక్రయ కేంద్రాల్లో టీజీ సేఫ్(TG Safe) చేపట్టిన తనిఖీల్లో విస్తుబోయే నిజాలు బట్టబయలయ్యాయి.

గడువు తీరిని ముడి సరుకులు, బొద్దింకలు, ఈగ లు, ఎలుకల సంచారం, స్వీట్లపై వార్తాపత్రికల వినియోగం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. 16 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని ఐదు సంస్థలను మూసివేయించారు. మరో ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(TG Safe Enforcement Officials), హైదరాబాద్ పోలీసులతో 13 బృందాలుగా ఏర్పడి.. క్యూర్ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. కల్తీ సరుకుల అనుమానంతో 22 ఆహార నమూనాలను సేకరించారు. 3,546.5 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16,86,018గా అధికారులు పేర్కొన్నారు. పలు సంస్థల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు, తగిన లైసెన్స్ కేటగిరీ లేకపోవడం, దెబ్బతిన్న నేలలు, మురికి గోడలు, ఆహార వ్యర్థాలతో నిండిన డ్రెయిన్లు, అపరిశుభ్ర వంట పాత్రలను అధికారుల కళ్లకు కట్టాయి. కొన్ని చోట్ల బొద్దింకలు, ఈగలు, ఎలుకలు కూడా అధికారుల కంట పడ్డాయి.

ఆహార పదార్థాల తయారీ సమయంలో సిబ్బంది హెయిర్ నెట్స్, గ్లౌజులు, యూనిఫాం, రక్షణ పరికరాలు ధరించకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, సిబ్బంది ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు నిర్వహించకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. కొన్ని కేంద్రాల్లో గడువు ముగిసిన, లేబుళ్లు సరిగా లేని ఆహార పదార్థాలు కనిపించాయి. స్వీట్లు, చిరుతిళ్లను కప్పేందుకు వార్తాపత్రికలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని ఐదు సంస్థలను మూసివేశారు. చంపాపేటలోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్ పీజీ రోడ్డులోని మమత స్వీట్ హౌస్, కాటేదాన్ లక్మిగూడ బృం దావన్ కాలనీలో ఎస్కే ఫుడ్స్, ఎంజే మార్కెట్‌లోని హమీదీ కన్ఫెక్షనరీస్, హైదరాబాద్ చుడీబజార్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్‌ను మూసి వేయించారు.

ఎస్కే ఫుడ్స్‌లో ప్యాక్ చేసిన స్వీట్లపై తయారీ తేదీ 31 అక్టోబర్ 2026గా ఉండటం గమనార్హం. అలాగే మరో ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. చార్మినార్ చార్‌కమాన్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్ రెస్టారెంట్, సనత్‌నగర్‌లోని జి.పుల్లారెడ్డి స్వీట్స్, వనస్థలిపురంలోని స్వీటోన్ రుచులు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫలక్‌నామా షంషీర్‌గంజ్‌లోని బాలాజీ శ్రీకిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మినర్వా స్వీట్స్) సంస్థల  లైసెన్సులను సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

జీ పుల్లారెడ్డి స్వీట్స్‌లో 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15,03,582గా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మరో ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సనత్‌నగర్‌లోని భారత్ బక్లావా, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని కరాచీ బేకరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఐదు సంస్థలకు నోటీసులు అందించారు. హిమాయత్‌నగర్‌లోని శ్రీ షగున్ మిఠాయి కేంద్రంలో లోపాలను సరిచేసుకోవాలని నోటీసు జారీ చేశారు.

మరిన్ని వార్తలు