వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి ఫిర్యాదు..

28-11-2026 | 11:12pm

ఎంపీ వంశీకృష్ణ తీరుపై అధిష్టానానికి వినతి

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు.. 

ఎంపీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు వినతి

మంథని, నవంబర్ 28(విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamshikrishna) వ్యవహారశైలిపై మంథని కాంగ్రెస్ నాయకుల్లో(Manthani Congress leaders) అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు వినతిపత్రం అందజేశారు.

నవంబర్ 25న మంథని మున్సిపాలిటీ(Manthani Municipality) పరిధిలో ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంపీ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు నిబంధనల ప్రకారమే పొందుపరిచారని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు, దుద్దిళ్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వంశీకృష్ణ గెలుపు కోసం కష్టపడ్డారని గుర్తుచేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంథని అత్యధిక మెజార్టీ అందించిందని తెలిపారు.

అయితే ఎంపీ మంథని పర్యటనలకు వచ్చినప్పుడు స్థానిక కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులతో కార్యక్రమాల్లో పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందన్నారు. మున్సిపల్ చైర్మన్ సొంత వార్డులో గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రతిపక్ష నాయకుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొనడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.

గత నాలుగు దశాబ్దాలుగా మంథనిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఎంపీ తీరుతో మనస్తాపానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ చర్యలు ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేందుకు అవకాశమిస్తున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావును కోరారు. పార్టీ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెంటరి రాజు, లైసెట్టి రజిత-రాజు, పీసీసీ అధికార ప్రతినిధి మేడగోని కమల్, నాయకులు ఆకుల శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు