బియ్యం అవుట్ లెట్ ను ప్రారంభించిన కలెక్టర్

05-11-2026 | 10:50pm

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణా మందిర్ రోడ్డు నం.2 లో ధనలక్ష్మి ట్రేడర్ వారు ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, మండల తహసిల్దార్ కృష్ణ లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు.

26 కిలోల బరువుతో కూడిన బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను 1 వేయి 430 రూపాయలు, స్టీమ్ రైస్ ను 1 వేయి 560 రూపాయలు, హెచ్.ఎం.టి. స్టీమ్ రకం బియ్యం బస్తా 1 వేయి 898 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లాలోని మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ప్రాంతాలలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భీమారం, శక్తి పేట ప్రాంతాలలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మార్కెట్ ధరలతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కటే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్, త్రాగునీరు, సాగునీటి వినియోగంలో పొదుపు పాటించాలని తెలిపారు. రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలలో నీటి వృథాను అరికట్టాలని, విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని, అవసరం లేని సమయంలో ఫ్యాన్లు, లైట్లు ఆపివేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 11 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించడం జరిగిందని, నేలను తేమ శాతం, పంటలపై ప్రభావం, లోటు వర్షపాతం అంశాలను ప్రామాణికంగా తీసుకొని శాస్త్రీయంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు