విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

05-11-2026 | 10:45pm

మరిమడ్ల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

బీజేపీలో చేరిన 210 మందికి పైగా యువకులు

కోనరావుపేట నవంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు.గురువారం కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పేదరికం విద్యార్థుల కలలకు అడ్డంకి కాకూడదని, పట్టుదలతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, శాస్త్రవేత్తలు, గొప్ప నాయకులుగా ఎదగాలనే లక్ష్యాలను పెట్టుకోవాలని సూచించారు.తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను గౌరవించాలని, చదువుతోపాటు మంచి సంస్కారం, దేశభక్తిని అలవర్చుకోవాలని తెలిపారు.

ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత సొంత గ్రామాన్ని, చదువుకున్న పాఠశాలను, సహకరించిన సమాజాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు చూడటం, వారి భవిష్యత్తుకు తన వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీలో 210 మందికి పైగా యువత చేరిక. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు చల్ల జితేందర్, గుండా శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 210 మందికి పైగా యువకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన యువతకు ఆయన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ, మరిమడ్ల గ్రామ సర్పంచ్ కోలా స్వాతి, అజ్మీర తండా సర్పంచ్ అజ్మీర జయరాం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టే రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలంధర్, మండల ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్, చింతల పరుశురాములు, చీకటి మధు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు జింక వెంకటి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల జయశ్రీ, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అజ్మీర వినోద్, మరిమడ్ల గ్రామ బూత్ అధ్యక్షులు అనుక్, తిరుపతితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు