మైత్రి ఆటో యూనియన్ సోషల్ మీడియా కన్వీనర్‌గా మాదేశి శ్రావణ్ కుమార్

05-11-2026 | 10:53pm

ఘనంగా సన్మానించిన యూనియన్ కార్యవర్గం

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని మైత్రి ఆటో యూనియన్ సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమితులైన మాదేశి శ్రావణ్ కుమార్‌ను గురువారం యూనియన్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గడిపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగల రాజు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పరిశోధనాత్మక కథనాలతో అనతికాలంలోనే పత్రికా రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ ఆటో డ్రైవర్ వృత్తిని గౌరవిస్తూ, మరోవైపు పత్రికా రంగంలోనూ ప్రజా సేవ చేయడం అభినందనీయమన్నారు.

ఆటో డ్రైవర్ల వృత్తిని చిన్నచూపు చూడకూడదని, సామాన్యులకు ఆపద సమయంలో ముందుగా గుర్తుకొచ్చేది ఆటోనేనని పేర్కొన్నారు. ఎంతోమంది చదువుకున్న యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధిని ఎంచుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని, ప్రభుత్వం ఈ సమస్యను పునఃపరిశీలించి డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా నిలుస్తూ సామాన్యుల సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తోందని అన్నారు. తమ యూనియన్‌కు చెందిన వ్యక్తి పత్రికా రంగంలోనూ సేవలందించడం గర్వకారణమని, ఒకరిని గౌరవించుకోవడం అంటే తమ వృత్తిని తామే గౌరవించుకున్నట్లుగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్, ప్రచార కార్యదర్శి సంతోష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు